చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. అనాస్ పాషా ఖాన్ (5) అనే బాలుడు చందానగర్‌లోని సిటిజన్ కాలనీ, శివాజీనగర్ సమీపంలో కనిపించకుండా పోయాడు. బాలుడి తాత అబ్దుల్ అజీజ్ ఖాన్ (72) ఫిర్యాదు మేరకు వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 15న మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులు బాలుడు కనిపించడం లేదని గుర్తించారు. అప్పటివరకు తమతోనే ఉన్న బాలుడు ఎక్కడికి వెళ్లాడో తెలియక కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో చందానగర్ పోలీసులను ఆశ్రయించారు.

అదృశ్యమైన బాలుడి ఎత్తు సుమారు 2 అడుగులు, ముఖం గుండ్రంగా, ఛాయ తెలుపుగా ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడు అదృశ్యమైన సమయంలో లేత పసుపు రంగు టీ-షర్ట్, నీలం జీన్స్ ప్యాంట్, స్పోర్ట్స్ షూస్ ధరించి ఉన్నట్లు తెలిపారు.బాలుడి ఆచూకీ తెలిసిన వారు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఫిర్యాదుదారుడి సంప్రదింపు నంబర్ 9849209730గా పేర్కొన్నారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బాలుడి ఆచూకీ క‌నుగొన్న పోలీసులు..

త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు వెంట‌నే 3 బృందాల‌ను ఏర్పాటు చేసి బాలుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. స‌మీపంలోని సీసీ టీవీ కెమెరాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఈ క్ర‌మంలో అదృశ్యం అయిన బాలుడ్ని పోలీసులు ఎట్ట‌కేల‌కు గుర్తించారు. వెంట‌నే సంబంధీకుల‌కు అప్ప‌గించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here