శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఆదోని మండలం సదాపురం గ్రామానికి చెందిన ఎన్. సరస్వతి తన కుటుంబంతో కలిసి సుమారు నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి చందానగర్ నేతాజీనగర్‌లో నివసిస్తోంది. ఆమె కుమారుడు ఎన్. మల్లికార్జున్ (22) రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఆగస్టు 14న సాయంత్రం 6.30 గంటల సమయంలో మల్లికార్జున్ తన స్నేహితుడు లక్ష్మీకాంత్‌తో కలిసి జ్వరంతో బాధపడుతున్న అతడి కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. రాత్రి 8 గంటల సమయంలో బొండలగడ్డ గ్రేవ్‌యార్డ్, పాపిరెడ్డికాలనీ సమీపంలో మల్లికార్జున్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు లక్ష్మీకాంత్ సరస్వతికి ఫోన్లో సమాచారం అందించాడు.
ప్రమాదంలో తీవ్ర రక్తస్రావంతో గాయపడిన మల్లికార్జున్‌ను తొలుత మసీద్‌బండలోని శ్రీ శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి రాత్రి 10.52 గంటలకు మల్లికార్జున్ మృతి చెందినట్లు ప్రకటించారు. మల్లికార్జున్ ప్రయాణిస్తున్న బైక్ నంబర్ TS07HW8375 కాగా, ఎదురుగా వచ్చిన TS08UF5765 నంబర్ ఆటోను డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడుపుతూ ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మల్లికార్జున్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఘటనపై మృతుడి తల్లి సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు క్రైమ్ నంబర్ 882/2026, BNS సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు.





