శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల లేమిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న కష్టాలపై వారు తీవ్రస్థాయిలో స్పందించారు. కొండాపూర్ ఆసుపత్రికి నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది నిరుపేద, మధ్యతరగతి రోగులు వైద్యం కోసం వస్తుంటారని, కానీ ఇక్కడ ఏడు రోజులుగా కరెంట్ సౌకర్యం లేదని,టార్చ్ లైట్ వెలుతురులో ప్రసవాలు చేస్తున్నారని అన్నారు. కనీసం పేపర్లు లేక గర్భిణీల చేతుల మీద బీపీ, షుగర్ లు రాస్తున్నారని, లిఫ్ట్ సౌకర్యం లేక 3 అంతస్తులు ఎక్కి బాలింతలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. త్రాగు నీరు వసతులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే ఆసుపత్రిలో మౌలిక వసతులను మెరుగుపరిచి, పేద ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలే: బొబ్బ నవతా రెడ్డి
బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ బొబ్బ నవతా రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ, ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎంఏల్ఏ కు ఏడు రోజులుగా కరెంట్ లేదన్న విషయం తెలియదా అని, ఎంఎల్ఏకి పేద ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఎంఎల్ఏ తక్షణమే స్పందించి, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, నిరుపేదలకు కార్పొరేట్ స్థాయికి దీటుగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, సమస్యలు పరిష్కరించని పక్షంలో బీఆర్ఎస్ రోగుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతుందని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో మారబోయిన రవి యాదవ్, మిద్దెల మల్లా రెడ్డి,అల్లావుద్దీన్ పటేల్, మమత, పొట్ట నరేందర్ యాదవ్, విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.





