వట్టే జానయ్యపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలి.. ప్రభుత్వ అరెస్టులపై బీసీ సంఘాల నిర‌స‌న‌..

శేరిలింగంపల్లి, జూలై 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్యపై నమోదు చేసిన పీడీ యాక్ట్, అరెస్టులు, ప్రభుత్వ వైఖరిని తక్షణమే ఉపసంహరించుకోవాలని బీసీ కులాల సంఘాల ఐక్యవేదిక, హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బీసీ కులాల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు డాక్టర్ శివ ముదిరాజ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ వట్టే జానయ్యపై నమోదు చేసిన పీడీ యాక్ట్, అరెస్టులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఆయనపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

భువనగిరిలో నిర్వహించిన రాజ్యాధికార పార్టీ సభ విజయవంతం కావడంతో రాజకీయ కక్షసాధింపులో భాగంగానే జానయ్యపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. బీసీ నాయకులు ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలను అణచివేయడానికి పీడీ యాక్ట్ వంటి చట్టాలను ఉపయోగించడం సరికాదని, ప్రభుత్వం దౌర్జన్యపూరిత చర్యలను విరమించుకోవాలని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి ముదిరాజ్ సంఘం ఇన్‌చార్జ్ కొత్తూరు మనోజ్ ముదిరాజ్, సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగ సంఘం నాయకుడు పరమేష్, బీసీ ఫెడరేషన్ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొని వట్టే జానయ్యపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here