శేరిలింగంపల్లి, జూలై 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేజ్-2కు చెందిన షాహిన్ బేగంకు అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఈ మేరకు సీఎంఆర్‌ఎఫ్-ఎల్‌వోసీ (CMRF-LOC) ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే సంక్షేమ పథకమని పేర్కొన్నారు. ప్రజాక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.

అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్నహస్తంలా నిలుస్తోందని గాంధీ తెలిపారు. ఖరీదైన వైద్య చికిత్స పొందేందుకు ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ఈ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందని చెప్పారు. వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





