ఇంట్లో పాత ఫర్నిచర్ ఉందా? పారేయొద్దు.. సీఎంసీ కొత్త కార్యక్రమంతో రీయూజ్, రీసైక్లింగ్‌కు ప్రోత్సాహం

శేరిలింగంపల్లి, జూలై 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సుస్థిర ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఫర్నిచర్ వ్యర్థాల బాధ్యతాయుత నిర్వహణ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఉపయోగంలో లేని ఫర్నిచర్‌ను శాస్త్రీయంగా నిర్వహించడం, పునర్వినియోగం (Reuse), మరమ్మత్తులు (Refurbishment), రీసైక్లింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ల్యాండ్‌ఫిల్‌లకు చేరే వ్యర్థాలను తగ్గించి, సహజ వనరులను పరిరక్షించడం, సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా పౌరులు, అపార్ట్‌మెంట్‌లు, నివాస సముదాయాలు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలు ఉపయోగించగలిగే ఫర్నిచర్‌ను పారవేయకుండా పునర్వినియోగం లేదా మరమ్మత్తులు చేయించి తిరిగి ఉపయోగించాలని సీఎంసీ సూచిస్తోంది. దీంతో వ్యర్థాల ఉత్పత్తి తగ్గడమే కాకుండా వనరుల సమర్థ వినియోగానికి అవకాశం కలుగుతుందని తెలిపింది.

ఈ సందర్భంగా IKEA India అమలు చేస్తున్న Buy Back, Reshop Programmeను సీఎంసీ అభినందించింది. ఈ కార్యక్రమం కింద అర్హత కలిగిన ఉపయోగించిన ఫర్నిచర్‌ను వినియోగదారుల నుంచి స్వీకరించి, తనిఖీ అనంతరం మళ్లీ విక్రయించడం ద్వారా ఫర్నిచర్‌కు రెండో జీవితం కల్పిస్తున్నట్లు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బాధ్యతాయుత ఫర్నిచర్ వ్యర్థాల నిర్వహణలో ప్రజలు, సంస్థలు, వాణిజ్య సంస్థలు చురుకుగా భాగస్వాములు కావాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here