శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) సంయుక్తంగా సీఎంసీ అధికారిక లోగో రూపకల్పన పోటీకి ఎంట్రీలను ఆహ్వానించింది. విద్యార్థులు, ఆర్కిటెక్టులు, గ్రాఫిక్ డిజైనర్లు, విజువల్ ఆర్టిస్టులు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులు ఈ పోటీలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం వంటి విలువలను ప్రతిబింబించేలా, భవిష్యత్‌కు సిద్ధమైన సైబరాబాద్ దృక్పథాన్ని ఆవిష్కరించే విధంగా లోగో ఉండాలని సూచించారు.

పూర్తిగా మౌలిక (Original) డిజైన్‌లకే అవకాశం ఉంటుందని, AI, EPS లేదా SVG వెక్టర్ ఫార్మాట్‌లకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అధిక నాణ్యత కలిగిన PNG లేదా JPEG ఫైల్‌తో పాటు గరిష్ఠంగా 250 పదాల్లో డిజైన్ తాత్వికత (Design Philosophy)ని సమర్పించాలి. ఒక్కో అభ్యర్థి ఒక్క ఎంట్రీ మాత్రమే పంపాలి. కాపీరైట్ ఉల్లంఘన లేదా AI ద్వారా నకలు చేసిన డిజైన్లను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. డిజిటల్, ప్రింట్ వినియోగానికి అనువుగా లోగో ఉండాలి. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నారు. ప్రథమ బహుమతి రూ.20వేలు, ద్వితీయ బహుమతి రూ.15వేలు, తృతీయ బహుమతిని రూ.10వేలుగా నిర్ణయించారు. ఎంట్రీల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 5. జ్యూరీ మూల్యాంకనం అనంతరం ఆగస్టు 10న విజేతలను ప్రకటించనుండగా, ఎంపికైన అధికారిక లోగోను ఆగస్టు 15న ఆవిష్కరించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ప్రకటనలో ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ ఎంట్రీలను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.





