శేరిలింగంపల్లి, జూలై 14 (నమస్తే శేరిలింగంపల్లి): వైద్య ఖర్చుల నిమిత్తం ఇద్దరు దంపతులు చేసిన అప్పుకు గాను కాంట్రాక్టర్ల వద్ద కొన్నేళ్ల నుంచి బానిసలుగా పనిచేస్తున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లికి చెందిన కోటా శ్రీనివాస్ తన భార్య వైద్య ఖర్చుల నిమిత్తం ఎ.రాములు అనే కాంట్రాక్టర్ వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకోగా, కృష్ణ అనే మరో కాంట్రాక్టర్ నుంచి రూ.1 లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పులు చెల్లించేందుకు శ్రీనివాస్ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు దంపతులను ఆ కాంట్రాక్టర్లు గత 4 ఏళ్ల నుంచి బానిసలుగా పనిచేయిస్తున్నారు. న్యూ హఫీజ్‌పేట ప్రేమ్ నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఆ దంపతులను పని చేయించసాగారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎ.శ్రీను మంగళవారం పంచనామా నిర్వహించి పోలీసులకు నివేదిక సమర్పించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






