ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలి.. దోమల నివారణపై ఆరెకపూడి గాంధీ అవగాహన..

శేరిలింగంపల్లి, జూలై 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్‌లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాసంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత కోసం ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని ప్రత్యక్షంగా పరిశీలించి తొలగించారు.

మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా వంటి వ్యాధులకు కారణమయ్యే దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రతి శుక్రవారం కూలర్లు, ఫ్రిజ్ ట్రేలు, కుండలు, బకెట్లు, పాత టైర్లు తదితరాల్లో నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేయాలని గాంధీ సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రతి కుటుంబం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా వంటి వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలను ప్రజలకు వివరించాలని అధికారులకు ఆరెకపూడి గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here