శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న రోడ్ల గుంతల మరమ్మత్తు పనులను జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ, డీసీతోపాటు ఇతర అధికారులతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించి మరమ్మత్తు పనుల నాణ్యతను తనిఖీ చేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలికంగా మన్నికగా ఉండే విధంగా గుంతల మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వెట్ మిక్స్ షెల్‌మాక్ బ్యాగులను వినియోగించాలని, మరమ్మత్తులు చేసిన ప్రాంతాల్లో సరైన కాంపాక్షన్ కోసం మినీ టాండమ్ వైబ్రేటరీ రోలర్ ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ స్వయంగా రోడ్ రోలర్‌ను నడిపి గుంతల మరమ్మత్తుల గట్టిదనం, నాణ్యతను పరిశీలించారు.

ప్రజలకు సురక్షితమైన, సాఫీగా ప్రయాణించగలిగే రహదారులను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణతోపాటు సమయానుకూల చర్యల ద్వారా సైబరాబాద్‌ను గుంతలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ తెలిపారు.





