శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): బహుజన రాజ్యాధికారం సాధించాలంటే రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు, కుల సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. బీసీ సంఘాల మధ్య ఐక్యత పెంపొందించి, బహుజనులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం సాధించడమే బీసీ ఐక్యవేదిక ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంగలి సాయిలు, సంఘం కార్యవర్గ సభ్యులతో బేరి రామచందర్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం కార్యవర్గం బీసీ కుల సంఘాల ఐక్యవేదికకు పూర్తి మద్దతు ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా యాదవ్, ముదిరాజ్, పద్మశాలి, గౌడ్, మున్నూరు కాపు తదితర బీసీ కుల సంఘాల నాయకులతో చర్చలు కొనసాగుతున్నాయని బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. ఇప్పటికీ కొన్ని బీసీ కులాలు గుర్తింపు, నివాసం, జీవనాధారం వంటి ప్రాథమిక హక్కులకు దూరంగా ఉన్నాయని, అలాంటి వర్గాలకు న్యాయం జరిగేలా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కులాల జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి వర్గానికి రావాల్సిన వాటా అందాలని, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లక్ష్యాల సాధన కోసం అన్ని బీసీ కుల సంఘాలు ఐక్యవేదికకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సాయన్న ముదిరాజ్, హరికృష్ణ చారి, కుమార్ యాదవ్, సాయి కురుమ, రాజు గౌడ్, పద్మశాలి అశోక్, కిరణ్ ముదిరాజ్, రజక సంఘం నాయకుడు మల్లేష్తోపాటు పలువురు బీసీ కుల సంఘాల నాయకులు, యువత పాల్గొన్నారు.





