వర్షాకాల సన్నద్ధతకు సైబరాబాద్ CMC కీలక చర్యలు

శేరిలింగంప‌ల్లి, జూలై 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కీలక చర్యలు చేపట్టింది. TGiCCC ఆధ్వర్యంలో నిర్వహించిన జాయింట్ యాక్షన్ టీమ్స్ (JATs) ఓరియంటేషన్ కార్యక్రమంలో కమిషనర్ సృజ‌న‌ పాల్గొని వర్షాకాల సన్నద్ధత, సమన్వయ వ్యవస్థపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీసు శాఖ, హైడ్రా, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, అగ్నిమాపక శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, భారత వాతావరణ శాఖ (IMD)తోపాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పట్టణ వరదల నిర్వహణ, వాతావరణ అంచనాలు, సహాయక చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు స్పందన, జాయింట్ యాక్షన్ టీమ్స్ బాధ్యతలపై నిపుణులు అధికారులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో సకాలంలో చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే భారత వాతావరణ శాఖ నుంచి ఒక గంట, రెండు గంటల ముందస్తు ప్రాంతాల వారీ వర్షపాతం అంచనాలు అందేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, తద్వారా ముందస్తు చర్యలు వేగంగా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. వర్షాకాలానికి సంబంధించిన పనులను స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలుగా విభజించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. తక్షణ సమస్యల పరిష్కారంతోపాటు శాశ్వత పరిష్కారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో సమర్థవంతమైన సమన్వయం, వేగవంతమైన స్పందన, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడమే జాయింట్ యాక్షన్ టీమ్స్ ఓరియంటేషన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here