శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఉషా ముళ్లపూడి కమాన్ నుంచి గాజుల రామారం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారిపై చేపడుతున్న 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, సీఎంసీ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, ఉషా ముళ్లపూడి కమాన్ నుంచి గాజులరామారం వరకు ఎల్లమ్మబండ మార్గంలో నిత్యం తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టినట్లు చెప్పారు. రోడ్డు విస్తరణలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు గతంలో అధికారులతో కలిసి ఉషాముళ్లపూడి కమాన్ నుంచి సిక్కుల బస్తీ వరకు పాదయాత్ర నిర్వహించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

రోడ్డు మధ్యలో ఉన్న బండరాళ్లను తొలగించడం, రహదారికి అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించడం, ఉషాముళ్లపూడి కమాన్ నుంచి సిక్కుల బస్తీ వరకు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను స్థానభ్రంశం చేయడం వంటి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత, సౌకర్యవంతమైన, మెరుగైన రవాణా వ్యవస్థ అందించడమే తమ లక్ష్యమని ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించినట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొనే ఏ చిన్న సమస్యనైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





