శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న SIR-2026 (Special Intensive Revision) ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఆన్‌లైన్ అప్‌డేషన్ ప్రక్రియ పురోగతిని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి (ERO) నారాయణ్ అమిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మియాపూర్ సర్కిల్‌లోని మక్తా మహబూబ్‌పేట్, మయూరినగర్, హఫీజ్‌పేట్ ప్రాంతాలను సందర్శించిన ఆయన, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ తీరును పరిశీలించి క్షేత్ర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఫారాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, అదే సమయంలో కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పంపిణీ పూర్తి చేసి, లక్ష్యాలను సకాలంలో సాధించాలని సూచించారు.

ఆన్‌లైన్ అప్‌డేషన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి పారదర్శకతతో పనులు నిర్వహించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అలాగే వివిధ విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం, అంకితభావంతో పని చేయడం ద్వారా మాత్రమే లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయగలమని చెప్పారు. SIR-2026 ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి దశలోనూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ఎన్నికల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు, సిబ్బందికి నారాయణ్ అమిత్ సూచించారు.





