శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్, చెన్నై షాపింగ్ మాల్ సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో నిర్మించిన నాలుగు అదనపు తరగతి గదుల భవనాన్ని PAC చైర్మన్ అరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MEO రవీందర్ రాజు, ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు నాలుగు కొత్త తరగతి గదులు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాథమిక విద్యే బలమైన పునాది అని అన్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనం విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

CSR నిధులతో విద్యాభివృద్ధికి సహకరించిన రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్, చెన్నై షాపింగ్ మాల్ ప్రతినిధులను ఆయన అభినందించారు. సమాజానికి సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, విద్యార్థులు క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అరెకపూడి గాంధీ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మియాపూర్‌లో 10 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా పాఠశాలకు శంకుస్థాపన జరిగిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అలాగే కొండాపూర్, చందానగర్ ప్రాంతాల్లో కోర్ అర్బన్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ దిశగా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు అశోక్ అగర్వాల్, అనిరుద్ సోంపల్లి, లోకేశ్వర్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్, విదిష అగర్వాల్, దీపా శర్మ, శిశం సబర్వాల్, రీటా అగర్వాల్, తేజస్విని రెడ్డి, చెన్నై షాపింగ్ మాల్ ప్రతినిధులు శంకర్, సంజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.





