ఓటరు జాబితాలో పేరు తప్పనిసరిగా చెక్ చేసుకోండి: గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జూన్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గౌలిదొడ్డి, నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి పరిశీలించారు. బీఎల్ఓలు, బీఎల్ఏలతో కలిసి ఓటరు జాబితా సవరణ, ఓటర్ల మ్యాపింగ్, ఎమ్యూనరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను ఆయన సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లను గుర్తించి తొలగించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అదే సమయంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి అర్హత కలిగిన యువతకు కొత్త ఓటు నమోదు చేసే అవకాశం కల్పించాలని అన్నారు.

ప్రతి కుటుంబం బీఎల్ఓలు అందజేసే ఎమ్యూనరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా స్వీకరించి, తమ వివరాలను పూర్తిగా నమోదు చేసి తిరిగి అందజేయాలని సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి పౌరుడు స్వయంగా పరిశీలించుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత అని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా నిజమైన ఓటర్ల గుర్తింపు, కుటుంబాల వారీగా ఓటర్ల మ్యాపింగ్, కొత్త ఓటర్ల నమోదు, అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ బీఎల్ఓలు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలు ఈ సవరించిన ఓటరు జాబితా ఆధారంగానే నిర్వహించబడనున్నందున ప్రతి బూత్‌లో పార్టీ బీఎల్ఏలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి బీఎల్ఓలతో కలిసి ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. పాత ఓటరు జాబితాలను పరిశీలిస్తూ ప్రతి ఇంటిని మ్యాపింగ్ చేసి, చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్, నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియకు సహకరించాలని కోరారు.

ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం జూలై 24 వరకు కొనసాగనున్నందున ప్రతి అర్హత కలిగిన ఓటరు ఇందులో భాగస్వామి కావాలని, తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని గంగాధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన బీఎల్ఓలు, బీఎల్ఏలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎమ్యూనరేషన్ ఫారాలను పంపిణీ చేస్తూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్‌తోపాటు శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, కిషన్ గోలి, ప్రసాద్, సుమన్, రాకేష్, హెరాన్, అంబన్, అరుణ్ గౌడ్, సుధాకర్, రాజేష్, నిర్మల, భారతి, అరుణ్, బీఎల్ఓలు, బీఎల్ఏలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here