శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 అమలు పురోగతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (052) ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి శేరిలింగంపల్లి ఎన్నికల నమోదు అధికారి (ERO), జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ హాజరయ్యారు. అలాగే 052-శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs)తోపాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 అమలును సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలపై సమావేశంలో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా తయారీలో కచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అన్ని ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.





