బీజేపీ బలోపేతానికి కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూన్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవంతోపాటు వర్చువల్‌గా మరో తొమ్మిది జిల్లాల‌ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం, తెలంగాణ బూత్ అధ్యక్షులు–బీఎల్‌ఏ-2ల విజయ సంకల్ప సమ్మేళన కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర సంఘటనా మంత్రి చంద్రశేఖర్, ఇన్‌చార్జులు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్‌తోపాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.

రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలోపేతానికి కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల తెలంగాణ పర్యటన అందుకు నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో, జూన్ 29న వరంగల్‌లో బూత్ అధ్యక్షుల సమ్మేళనం, ఘట్‌కేసర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం ద్వారా పార్టీ విస్తరణకు కార్యాచరణ సిద్ధమవుతోందని పేర్కొన్నారు. బీజేపీకి బూత్ అధ్యక్షుడే వెన్నెముక అని, ప్రతి బూత్‌లో విజయం సాధిస్తే బస్తీ, కాలనీ, డివిజన్, నియోజకవర్గం, చివరకు తెలంగాణలో బీజేపీ విజయానికి బాటలు పడతాయని అన్నారు. ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన రవికుమార్ యాదవ్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలతోపాటు నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు, రైతు సమస్యల పరిష్కారం, మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వివాహానికి రూ.లక్ష, తులం బంగారం వంటి హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలు ఇప్పుడు హామీల అమలుపైనే సమాధానం కోరుతున్నారని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, పారదర్శకత, సంక్షేమం దిశగా ముందుకెళ్తోందని, అదే మార్పు తెలంగాణలో కూడా తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. నితిన్ నబిన్ నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి నాయకులు, వివిధ మోర్చాల పదాధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here