శేరిలింగంపల్లి, జూన్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వేంకటేశ్వర నగర్ కాలనీలోని బస్తీ దవాఖానలో నిర్వహించిన పోలియో కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్య సిబ్బందితో కలిసి 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు చాలు అని పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.

పోలియో రహిత దేశమే మన లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రతి బిడ్డకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలతోపాటు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు. పోలియో చుక్కలు పూర్తిగా ఉచితమైనవి, సురక్షితమైనవని, ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశాన్ని పోలియో రహితంగా నిలబెట్టడంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని, ప్రజారోగ్య కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గాంధీ కోరారు. భారత ప్రభుత్వం పోలియో నిర్మూలన లక్ష్యంతో చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడం అత్యంత కీలకమని వివరించారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, బస్టాండ్లు తదితర ప్రత్యేక కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.
బూత్‌లకు రాలేని చిన్నారులకు ఆరోగ్య కార్యకర్తలు తరువాతి రెండు నుంచి మూడు రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. పోలియో రహిత దేశం, రాష్ట్రం, శేరిలింగంపల్లి నియోజకవర్గం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





