శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. మసీద్‌బండలోని బీజేపీ కార్యాలయంలో శ్రీ సాయి మేస్త్రి సంఘం అధ్యక్షుడు విశ్వేశ్వర్‌రావు, సంఘ సభ్యులు రవికుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కార్మికులకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ సాయి మేస్త్రి సంఘం ఏర్పాటు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-శ్రమ్ కార్డు ద్వారా రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా ప్రయోజనం పొందవచ్చని వివరించారు.

అలాగే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే, సభ్యుడు మరణించిన అనంతరం నామినీకి రూ.2 లక్షల బీమా సాయం అందుతుందని తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ద్వారా సంవత్సరానికి రూ.20 చెల్లించి ప్రమాద మరణం లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినప్పుడు బీమా ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి చేరేలా చర్యలు తీసుకుంటామని, కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఏ కష్టం వచ్చినా బీజేపీ అండగా నిలుస్తుందని రవికుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శ్రీ సాయి మేస్త్రి సంఘం అధ్యక్షుడు విశ్వేశ్వర్‌రావు, పూర్ణ, దీపాల కొండయ్య, రోశయ్య, వెంకటేశ్వర్లు, అంకమ్మరావు, సామ్యులు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.





