రూ.300 చీర‌ల‌తో మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు అవుతారా.. బొబ్బ‌ నవత రెడ్డి ఫైర్..

శేరిలింగంపల్లి, జూన్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా మహిళలను ఘోరంగా మోసం చేసిందని మాజీ కార్పొరేటర్ బొబ్బా నవత రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, మూడు సంవత్సరాలు గడిచినా హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇందిర‌ మహిళా శక్తి పేరుతో పంపిణీ చేస్తున్న చీరల విలువ కేవలం రూ.300 మాత్రమేనని, ఇలాంటి చౌకబారు చీరలను అందించి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని ఆమె మండిపడ్డారు. చీరల పంపిణీ సందర్భంగా మహిళలను బలవంతంగా ఐరిస్ పరీక్షలు చేయించడం, భుజంపై చీర వేసి ఫొటోలు దిగేలా ఒత్తిడి తేవడం అవమానకరమని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం కింద అత్తకు రూ.4,వేలు, కోడలికి రూ.2,500 ఆర్థిక సాయం, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, వృద్ధులకు పెరిగిన పెన్షన్లు వంటి హామీల అమలు ఎక్కడ జరిగిందని ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేవలం రూ.300 చీరలు పంచి మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. చందానగర్ డివిజన్‌లోని కైలాష్‌నగర్ కాలనీలో మహిళా భవనం నిర్మాణం కోసం గత ప్రభుత్వం కేటాయించిన 4వేల గజాల విలువైన సీఎంసీ ప్రభుత్వ భూమిని విద్యుత్ శాఖ ఆక్రమించుకుందని బొబ్బ‌ నవత రెడ్డి ఆరోపించారు. మహిళలకు కేటాయించిన స్థలాన్ని కాపాడాల్సిన స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మహిళా భవనాల నిర్మాణానికి ఇచ్చిన కోటి రూపాయల చెక్కు ఏమైందని నిలదీశారు. మహిళా భవనం స్థలాన్ని తిరిగి మహిళలకే అప్పగించకపోతే మహిళలతో కలిసి న్యాయపోరాటం చేపడతామని హెచ్చరించారు.

డ్వాక్రా మహిళలతోపాటు అర్హులైన నిరుపేద మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు వెంటనే కేటాయించాలని, తులం బంగారం, మహాలక్ష్మి పథకం నగదు సాయం, విద్యార్థినులకు స్కూటీలు సహా ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెల రోజుల్లో అమలు చేయాలని నవత రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నియోజకవర్గవ్యాప్తంగా మహిళలను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులపై ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here