శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేతాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బేరి రామ్‌చందర్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు సోమవారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బేరి రామ్‌చందర్ యాదవ్ మాట్లాడుతూ నల్లగండ్ల చెరువు నుంచి 33 అడుగుల నాలా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అయితే ఆ పనుల వల్ల నేతాజీ నగర్ కాలనీలోని రెండు ప్రధాన రోడ్లు ప్రభావితమవుతున్నాయని తెలిపారు. నాలా వెడల్పు కారణంగా రోడ్ల విస్తీర్ణం తగ్గిపోతుండటంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల నాలా మార్గాన్ని కొంత మేర సవరించి నిర్మాణం చేపట్టాలని కమిషనర్‌ను కోరారు. అలాగే కాలనీలో మురుగునీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 33 అడుగుల నాలాకు అవుట్‌లెట్ కల్పించి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాలనీలోని ప్రధాన రహదారుల్లో సీసీ రోడ్లు నిర్మించడంతోపాటు దాదాపు 3 వేల మంది పేద, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో చిన్నారులు, వృద్ధుల కోసం పార్కును అభివృద్ధి చేయాలని కూడా కోరారు. వినతిపత్రంపై కమిషనర్ సృజన సానుకూలంగా స్పందించారని, సమస్యలను పరిశీలించి త్వరలోనే పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు బేరి రామ్‌చందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రసాద్, రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.





