ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026పై విస్తృత శిక్షణ

శేరిలింగంప‌ల్లి, జూన్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026 కార్యక్రమం అమలుకు సంబంధించి బూత్ లెవెల్ అధికారులు (BLOలు), బూత్ లెవెల్ ఏజెంట్ల‌ (BLAలు) కోసం సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఈఆర్వో (ERO), శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ తెలిపారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వేదికగా నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని 52-శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన BLOలు, BLAలు పాల్గొన్నారు.

శిక్షణలో భాగంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, క్షేత్ర స్థాయి బాధ్యతలు, అర్హులైన ఓటర్ల నమోదు, అలాగే క‌చ్చితమైన, పారదర్శకమైన, సమ్మిళిత ఓటరు జాబితాల రూపకల్పనపై అధికారులు వివరంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రతినిధులు చురుకుగా పాల్గొని నిర్మాణాత్మక చర్చలు జరిపినట్లు నారాయణ్ అమిత్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను పెంపొందించడంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాల‌నీ, మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లకు చెందిన అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROs), ఉప కమిషనర్లు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here