శేరిలింగంపల్లి, జూన్15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ మక్తా మహబూబ్పేట్ పరిధిలోని సర్వే నంబర్ 44లో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సీఎంసీ ప్రజావాణిలో 31 ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారని, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లోనై అక్రమ నిర్మాణాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజావాణి వ్యవస్థ నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంసీ అధికారులు ఇప్పటికే సీజ్ చేసిన భవనాలపై ఏర్పాటు చేసిన సీజ్ బోర్డులను తొలగించి నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కొంతమంది బిల్డర్లు నిర్భయంగా నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలు కూడా నిర్వహిస్తున్నారని, దీనికి అధికారుల సహకారం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

అక్రమ నిర్మాణాలపై అనేక ఫిర్యాదులు, నోటీసులు ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం వెనుక అవినీతి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయని సంతోష్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం కాకుండా బిల్డర్ల ప్రయోజనాల కోసం అధికారులు పనిచేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, మియాపూర్ సర్కిల్ కమిషనర్ చర్యలు తీసుకుని ప్రజావాణిలో నమోదైన ఫిర్యాదులను విచారించాలని కోరారు. అలాగే సీజ్ చేసిన భవనాలపై ఉన్న సీజ్ ఆదేశాలను ఉల్లంఘించి నిర్మాణాలు కొనసాగిస్తున్న బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎంసీ అధికారుల పనితీరుపై విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖలు దృష్టి సారించాలని, అక్రమ నిర్మాణాల వ్యవహారంపై మీడియా కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.






