శేరిలింగంపల్లి, జూన్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిత్య-మదీనాగూడ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న కట్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం అత్యున్నత మానవతా సేవ అని అన్నారు. అత్యవసర పరిస్థితులు, శస్త్రచికిత్సలు, ఇతర వైద్య అవసరాల సమయంలో రోగుల ప్రాణాలను కాపాడటంలో స్వచ్ఛంద రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలని సూచించారు. హెల్త్ అండ్ కేర్ వాలంటరీ ఆర్గనైజేషన్ యూనిట్‌గా పనిచేస్తున్న ఆదిత్య-మదీనాగూడ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు వి. వెంకట ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో రక్తదానంపై అవగాహన పెంపొందించడం, అవసరమైన వారికి సురక్షితమైన రక్తాన్ని అందించడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ఈ సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో సాయి, గణేష్, కృష్ణ, శివ, సిద్ధు, నవీన్, రవి, తిరుపతి, సుశాంత్, కార్తీక్ పాల్గొని రక్తదానం చేశారు. వారి సేవాభావాన్ని నిర్వాహకులు అభినందించారు. యువతతోపాటు ప్రతి పౌరుడు స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రాణదాతలుగా నిలవాలని నిర్వాహకులు కోరారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం రక్తదాన ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించిందని తెలిపారు.





