శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో తరచూ ఏర్పడుతున్న నీటి నిల్వ (వాటర్‌లాగింగ్) సమస్యపై ట్రాఫిక్, పోలీసు అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీ ఎం.ఆది మూర్తి, చందానగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కలిసి గంగారం ఫుట్ ఓవర్ బ్రిడ్జి పరిసర ప్రాంతంతోపాటు గంగారం చెరువును సందర్శించారు. అధికారులు నీటి నిల్వ సమస్య తీవ్రత, కారణాలను స్థానికంగా పరిశీలించి సంబంధిత అంశాలపై వివరాలు సేకరించారు. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో పదేపదే నీరు నిల్వ ఉండటానికి దారితీస్తున్న పరిస్థితులను అంచనా వేసి, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భవిష్యత్తులో వాటర్‌లాగింగ్ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వర్షాకాలంలో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.






