శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి గ్రామం, ఇందిరా నగర్ ప్రాంతాల్లో నెలకొన్న నాలా, డ్రైనేజ్ సమస్యలను పరిశీలిస్తూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పర్యటించారు. ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు గచ్చిబౌలి గ్రామంలోని ఇందిరా నగర్ ప్రాంతాన్ని సందర్శించిన రవికుమార్ యాదవ్, అంజయ్య నగర్ నుంచి వచ్చే నాలాను రాడిసన్ హోటల్ సమీపంలో గచ్చిబౌలి గ్రామం మీదుగా వెళ్లే నాలాలో కలపడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గచ్చిబౌలి గ్రామం మొత్తం మురుగు నీటితో నిండిపోయే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరా నగర్లో నాలా, డ్రైనేజ్ సమస్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని, పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని అన్నారు. ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాలాలో మరో నాలాను కలపడం వల్ల సమస్య మరింత పెరిగిందని, సరైన ప్రణాళిక లేకుండా అధికారులు పనులు చేపడుతున్నారని విమర్శించారు. ప్రాంతంలో హాస్టళ్లు, నివాస గృహాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నాలా సామర్థ్యం సరిపోవడం లేదని, నాలా విస్తరణ అత్యవసరమని రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాత్కాలిక చర్యలతో కాలం గడపకుండా శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించి వెంటనే అమలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, నాయకులు ఓబుల్ రెడ్డి, మఖన్ సింగ్, నరసింహ, మహేందర్ యాదవ్, శశాంక్, రోహిత్, జైహింద్, మధు, రాఘవచారి, రఘునాథ్, సుబ్రమణ్యం, దినేష్, రాము తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





