శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య సేవల అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్యకలాపాలు సమర్థవంతంగా సాగేందుకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. శానిటేషన్ ఆటోలు ప్రతిరోజూ విధుల్లో ఉండేలా చూడాలని, దీర్ఘకాలంగా హాజరు కాని పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి నివేదించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విధించే జరిమానాలపై రోజువారీ నివేదికలు సమర్పించాలని సూచించారు. నో బిన్ – నో ట్రేడ్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, వ్యాపార సంస్థల్లో వ్యర్థాల నిర్వహణపై బాధ్యత పెంపొందించాలని కమిషనర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) అధికారులతో కలిసి అన్ని వార్డుల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

జూన్ నెలాఖరులోగా ప్రతి జోన్‌లోని వార్డులను జోనల్ కమిషనర్లు సందర్శించి, గుర్తించిన సమస్యలపై చర్యల నివేదికలను సమర్పించాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణలో భాగంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, శానిటరీ వేస్ట్, స్పెషల్ కేర్ వేస్ట్ అనే నాలుగు రకాల వ్యర్థాల వేరు వేరు సేకరణ (ఫోర్-వే వేస్ట్ సెగ్రిగేషన్)ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలు, వ్యాపార సంస్థలు, ఇతర భాగస్వాముల్లో మూలస్థాయిలోనే వ్యర్థాల వర్గీకరణపై అవగాహన పెంచాలని సూచించారు. పారిశుద్ధ్య సేవల మెరుగుదలకు శానిటేషన్ సిబ్బంది నియామకం, వినియోగంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు (సీ అండ్ డీ వేస్ట్)తోపాటు ఇతర భారీ వ్యర్థాల సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. ఆన్-కాల్, షెడ్యూల్డ్ కలెక్షన్ సేవల అమలు అవకాశాలను అధ్యయనం చేయాలని తెలిపారు.
సమావేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించిన కమిషనర్, నిబంధనల్లో పేర్కొన్న బాధ్యతలు, విధానాలు, ప్రమాణాలను ప్రతి అధికారి, సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల విజయానికి జవాబుదారీతనం, నిరంతర పర్యవేక్షణ, సమయానుకూల నివేదికలు, కట్టుదిట్టమైన అమలు కీలకమని పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణహిత సైబరాబాద్ నిర్మాణమే లక్ష్యమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని సూచించారు.





