సురభి యువత వాయిస్ అండ్ స్పీచ్ వర్క్‌షాప్ ఘనంగా ముగింపు

శేరిలింగంప‌ల్లి, జూన్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సురభి కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో సురభి యువత కోసం నిర్వహించిన 15 రోజుల వాయిస్ అండ్ స్పీచ్ వర్క్‌షాప్ ఘనంగా ముగిసింది. శేరిలింగంపల్లిలోని సురభి యువసేన భవనంలో నిర్వహించిన ఈ శిక్షణా శిబిరం యువతలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వర్క్‌షాప్ డైరెక్టర్ డా. రమేష్ సింధే పర్యవేక్షణలో జరిగిన ముగింపు కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వహణకు ఆర్థిక, నైతిక సహకారం అందించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. ఏనుగు నరసింహా రెడ్డి కి సురభి కళాక్షేత్రం నిర్వాహకులు, విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

15 రోజుల శిక్షణ అనంతరం విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ నిర్వహించిన స్టోరీ టెల్లింగ్, పబ్లిక్ స్పీకింగ్ ప్రజెంటేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్రీత్ టెక్నిక్స్, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలను సమర్థంగా వినియోగిస్తూ విద్యార్థులు తమలో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన రొట్టె ముక్క – కోతి తీర్పు లఘు నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్పష్టమైన ఉచ్చారణ, చక్కటి హావభావాలు, అద్భుతమైన టైమింగ్‌తో నాటకాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ముగింపు సభలో పాల్గొన్న అతిథులు విద్యార్థుల ప్రదర్శనలను అభినందించారు.

సురభి కాలనీవాసుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అవేటి శేఖర్ మాట్లాడుతూ, కేవలం 15 రోజుల్లోనే పిల్లల మాటతీరు, వ్యక్తీకరణలో వచ్చిన మార్పు ప్రశంసనీయమన్నారు. సురభి కళాకారులకు సహజంగా ఉన్న నాటక ప్రతిభకు ఈ శిక్షణ మరింత పదును పెట్టిందని పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత వనారస శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ నేటి యువతకు బ్రహ్మాస్త్రం లాంటివని, ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్‌లో విద్యార్థులు చూపిన భావవ్యక్తీకరణ విశేషమని కొనియాడారు. ఈ శిక్షణతో వారు భవిష్యత్తులో ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సహ కార్యదర్శి వి. జితేంద్ర మాట్లాడుతూ పిల్లలకు ఉపయోగపడే ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. డా. ఆర్. స్వప్న సుభద్రం మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు.

సురభి యువసేన అధ్యక్షుడు ఆర్. పూజిత్ సాయి కుమార్ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు, వ్యక్తీకరణ నైపుణ్యాలను వెలికితీయడంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సురభి నటి ఎ. సురభి జమునా రాయలు జ్ఞాపకార్థం ఆమె కుమార్తె రాగిణి వర్క్‌షాప్‌లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వర్క్‌షాప్ డైరెక్టర్ డా. రమేష్ సింధే మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసి, లఘు నాటికను అద్భుతంగా ప్రదర్శించడం గర్వకారణమన్నారు. సురభి యువత కోసం మరిన్ని ఉపయోగకరమైన వర్క్‌షాప్‌లు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సురభి కాలనీవాసుల సంక్షేమ సంఘం, సురభి యువసేన సభ్యులు, ప్రతిరోజూ పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here