శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఢిల్లీలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న లాఠీచార్జ్‌ను ఖండిస్తూ జూలై 24న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు USFI తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. USFI రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి, రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో దీక్ష భగ్నం చేయడం, పార్లమెంట్ ముట్టడి సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జ్ జరపడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విద్యార్థి, యువజన ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై 30 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. లాఠీచార్జ్ ఘటనలో అసాంఘిక శక్తుల ప్రమేయంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నీట్ పేపర్ లీకేజ్‌కు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూలై 24న నిర్వహించే విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాలు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతూ విజయవంతం చేయాలని USFI తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.





