శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ ఖానామెట్ గ్రామంలోని అసైన్డ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణం కొనసాగుతోందంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్లు 41/12, 41/13 పరిధిలోని ప్లాట్ నంబర్లు 46, 47లో బిల్డర్ మధుసూదన్ రెడ్డి అనుమతులకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, సంబంధిత అధికారుల నుంచి జి+3 (మూడు అంతస్తులు) నిర్మాణానికే అనుమతి ఉన్నప్పటికీ, ప్రస్తుతం జి+7 (ఏడు అంతస్తులు) వరకు నిర్మాణ పనులు చేపట్టినట్లు చెబుతున్నారు. అసైన్డ్ భూముల్లో ఇలాంటి నిర్మాణాలు కొనసాగుతున్నా టౌన్ ప్లానింగ్, జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు విమర్శిస్తున్నారు.

నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తూ అదనపు అంతస్తులు నిర్మించడం వల్ల భవిష్యత్తులో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్మాణాన్ని నిలిపివేసి, అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన అంతస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే విధంగా, అసైన్డ్ భూముల్లో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.





