శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపట్టిన వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ సృజన కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్‌లో ఉన్న పూడూర్-కిస్తాపూర్ వార్డును సందర్శించి క్షేత్రస్థాయిలో పౌర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాల సభ్యులతో సమావేశమై వారి సమస్యలు, అభివృద్ధి అవసరాలు, స్థానిక ప్రాధాన్యతలపై చర్చించారు. పర్యటనలో డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ప్రధానంగా రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, చెరువుల పరిరక్షణ, ప్రజా సౌకర్యాలకు సంబంధించిన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. స్థానికులు పూడూర్ గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఆర్ అండ్ బీ రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. రవాణా సౌలభ్యం పెంచడంతోపాటు గ్రామాల మధ్య అనుసంధానత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ అంశాలపై కూడా ప్రజలు పలు సూచనలు చేశారు. అన్ని నివాస ప్రాంతాలకు నిరంతరాయంగా తాగునీరు అందించడంతోపాటు గుర్తించిన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీలు) ఏర్పాటు చేయాలని కోరారు. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ (ఓహెచ్‌టీ) నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎర్రం చెరువు, మోతులకుంట చెరువుల కట్టలను బలోపేతం చేసి అభివృద్ధి చేయాలని, చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు. అలాగే వీధి దీపాలు లేని ప్రాంతాల్లో అదనపు స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేసి భద్రత, సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. ప్రజలు ప్రస్తావించిన అన్ని సమస్యలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు. ఆయా శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, అత్యవసర, ప్రాధాన్యత కలిగిన పనులను దశలవారీగా అమలు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ సృజన మాట్లాడుతూ వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో ప్రజలతో నేరుగా మమేకమై స్థానిక సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించడమే లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కార్పొరేషన్ కట్టుబడి ఉందని తెలిపారు. సీఎంసీ ప్రజలతో నిరంతర అనుసంధానం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయంతో పౌర మౌలిక సదుపాయాల మెరుగుదల, సమర్థవంతమైన సేవల అందజేతకు కృషి కొనసాగిస్తోందని పేర్కొన్నారు.





