శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ విప్ బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా శేరిలింగంపల్లి డివిజన్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ పాల్గొన్నారు. బాల్క సుమన్ అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో అవినీతి అంశాలపై ప్రశ్నించినందుకే బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఆయనపై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజు, కేఎన్ రాములు, శంకర్, విక్రమ్ యాదవ్, మల్లేష్, నరసింహ ముదిరాజ్, షరీన్, గౌస్, యూత్ నాయకులు, టీం పీఎన్వై సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






