శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ కులాలు, సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ వివిధ బీసీ కులాల ప్రముఖ నాయకులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నాయి బ్రాహ్మణ సంఘం ముఖ్య నాయకుడు శ్రీశైలం నాయి బ్రాహ్మణ, ముత్యాల రవీందర్ నాయి బ్రాహ్మణలను కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదికను బలోపేతం చేయడంలో భాగంగా శ్రీశైలం నాయి బ్రాహ్మణను ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని బేరి రామచంద్ర యాదవ్ కోరగా, ఆయన అంగీకరించి భవిష్యత్తులో బీసీల అభ్యున్నతికి కలిసి పనిచేస్తానని తెలిపారు. అలాగే ముత్యాల రవీందర్ నాయి బ్రాహ్మణను బీసీ ఐక్యవేదిక కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 132 బీసీ కులాల్లో వీలైనంత ఎక్కువ సంఘాల నాయకులను కలుసుకుని ఐక్యత సాధించాలని సూచించారు. ఇప్పటికే యాదవ, ముదిరాజ్, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులను కలిసి సహకారం కోరగా, వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీ వర్గాల ఐక్యత ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఆర్థిక, సామాజిక న్యాయం ప్రతి బీసీ కుటుంబానికి అందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, శ్రీశైలం నాయి బ్రాహ్మణ, ముత్యాల రవీందర్ నాయి బ్రాహ్మణ, అరుణ్ కుమార్ యాదవ్ గౌరెల్లి తదితరులు పాల్గొని భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు.





