శేరిలింగంపల్లిలో పారిశుధ్య కార్మికులకు ఉచిత డెంటల్, మెగా వైద్య శిబిరం

శేరిలింగంప‌ల్లి, మే 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుల కోసం ఉచిత డెంటల్ హెల్త్ అవగాహన క్యాంప్, మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA) సైబరాబాద్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, డీసీ ఇస్లావాత్ సేవా, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత డెంటల్, వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాల‌ను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి ఏడాది మే 31న నిర్వహించే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఉద్దేశం పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడమేనని చెప్పారు. సిగరెట్లు, బీడీలు, చుట్టలు, గుట్కా, ఖైనీ, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ వ్యసనంగా మారి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వివరించారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులతోపాటు గుండె సంబంధిత సమస్యలు, సంతానలేమి, వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పొగాకు వినియోగాన్ని తగ్గించాలని, యువతలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పొగాకు వినియోగ నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 80 లక్షల మంది పొగాకు వినియోగం కారణంగా మరణిస్తున్నారని, అందులో 13 లక్షల మంది నేరుగా ధూమపానం చేయకపోయినా పరోక్షంగా పొగను పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని గాంధీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది పొగాకు వినియోగదారులు ఉండగా, వారిలో 80 శాతం మంది అల్ప, మధ్య ఆదాయ దేశాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. 2025 నాటికి పొగాకు వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని WHO నివేదికలు వెల్లడించాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డీఈ ఆనంద్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మంత్రి ప్రగడ సత్యనారాయణ రావు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సైబరాబాద్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ సింహారాజు, డాక్టర్ శ్వేతా బారపటి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నిరూప, డాక్టర్ మోహన దీపికా, డాక్టర్ రమ్య శ్రీ, డాక్టర్ జయంతి, డాక్టర్ మన్మోహన్‌తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here