శేరిలింగంపల్లి, మే 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మియాపూర్–ఆల్విన్ కాలనీ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హెచ్‌ఐసీటీఐ (HICTI) ప్రాజెక్టుల ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి శంకుస్థాపన స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రూ.530 కోట్ల అంచనా వ్యయంతో మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు 1,790 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6-లేన్ ద్విముఖ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే హఫీజ్‌పేట్ నుంచి మియాపూర్ వరకు 3-లేన్ యూనీ డైరెక్షనల్ అండర్‌పాస్, బాచుపల్లి నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు మరో 3-లేన్ యూనీ డైరెక్షనల్ అండర్‌పాస్‌ను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నట్లు వెల్లడించారు.

ఈ ప్రాజెక్టుకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నట్లు తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్, బాచుపల్లి ప్రాంతాల మధ్య ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు ప్రయాణ సమయం, ఇంధన వినియోగం కూడా తగ్గుతాయని చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆధునిక ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నామని గాంధీ పేర్కొన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ట్రాఫిక్ రహిత సమాజం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఐటీ సంస్థలు, ఎత్తైన భవనాలు, అధిక జనసాంద్రత ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి హెచ్‌ఐసీటీఐ ప్రాజెక్ట్ ద్వారా సుదీర్ఘ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఐసీటీఐ ప్రాజెక్ట్స్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు డీఈ వరుణ్, ఏఈ శ్రీనాథ్, టౌన్ ప్లానింగ్ విభాగం టీపీఎస్ రమేష్‌తోపాటు నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, విఘ్నేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కిషన్ రావు, దామోదర్ రెడ్డి, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.





