వికారాబాద్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు భారీ స్పందన.. 530 మంది క్రీడాకారులతో జోష్..

శేరిలింగంపల్లి, మే 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని ఎస్‌ఎల్‌వీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహిస్తున్న జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ రావు, వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్‌తోపాటు పలువురు క్రీడా ప్రముఖులు, కోచ్‌లు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో క్రీడాకారులు నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అభివృద్ధికి అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్, కార్యదర్శి యు.వి.ఎన్. బాబు, సభ్యులు సుబ్బారెడ్డి, విజయ్‌కుమార్, పీవీఎల్ కుమార్, ఏ.వి. రమణా రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే అకాడమీ నిర్వాహకులు, చీఫ్ కోచ్ జయంత్, ఎం.రామరాజు, సాయితేజలను అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన యువ క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ, ప్రోత్సాహం అందించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వారి సమిష్టి కృషి ఫలితంగానే ఈ ఏడాది ఏకంగా 530 మంది క్రీడాకారులు ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. ఈ స్థాయిలో పాల్గొనడం వికారాబాద్ జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ యువ క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. ఇలాంటి పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, క్రీడాకారులు విజయ లక్ష్యంతో తమ ప్రతిభను కనబరిచారు. అధికారులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here