శేరిలింగంపల్లి, మే 22 (నమస్తే శేరిలింగంపల్లి): నడిగడ్డ తాండలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విద్యుత్ శాఖ ఎలక్ట్రికల్ ఏఈకి వినతిపత్రం సమర్పించారు. తండాలో గతంలో ఏర్పాటు చేసిన పలు విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకుని వంగిపోయాయని, వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా మారిన పాత స్తంభాల స్థానంలో వెంటనే కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొన్ని విద్యుత్ స్తంభాలు నివాస గృహాల మధ్యలో ఉండటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న స్తంభాలను తొలగించి రోడ్డు పక్కన లైన్లోకి మార్చాలని కోరారు. తండాలో ఇప్పటికీ కొన్ని ఇండ్లకు విద్యుత్ మీటర్లు లేకపోవడంతో అర్హులైన కుటుంబాలకు వెంటనే కొత్త మీటర్లు మంజూరు చేసి ఇంటింటికి విద్యుత్ సరఫరా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తండాలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తానని ఏఈ హామీ ఇచ్చినట్లు గిరిజన సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నడిగడ్డ తండా అధ్యక్షుడు సభవత్ హన్మ నాయక్, గౌరవ అధ్యక్షుడు ఎం. రెడ్యా నాయక్, కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, ఉపాధ్యక్షుడు నాయిని రత్నకుమార్, సభ్యులు కాట్రావత్ శంకర్ నాయక్, అంగోత్ మోతిరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





