NEET లీకేజీపై ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని AIFDS డిమాండ్

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): NEET పరీక్షా పేపర్ లీకేజీ ఘటన విష‌యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి Dharmendra Pradhan నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని AIFDS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న NEET పరీక్షా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, పేపర్ లీకేజీలకు కేంద్రంలోని BJP ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు. మియాపూర్ ఎంఏ నగర్‌లోని తాండ్ర రామచంద్రయ్య భవన్‌లో నిర్వహించిన AIFDS ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా గడ్డం నాగార్జున మాట్లాడుతూ, దేశ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశయాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రతి సంవత్సరం NEET పరీక్షలు పేపర్ లీకేజీలు, అవినీతి, అక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం, NTA ఎలాంటి సంస్కరణలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే, మరోవైపు పేపర్ లీకేజీ మాఫియా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఉన్న పెద్దలను కాపాడేందుకే అసలు నిందితులను బయటకు తీయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో ఆటలాడే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని, వెంటనే NTA ని రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. అలాగే NEET పేపర్ లీకేజీ వెనుక ఉన్న మాఫియాను పూర్తిగా వెలికితీసి, వారికి కఠిన శిక్షలు విధించాలని, బాధిత విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here