శేరిలింగంపల్లి, మే 15 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజలను తీరని ఇబ్బందులకు గురిచేస్తోందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే నిరుద్యోగం, ధరల భారం, ఆర్థిక కష్టాలతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు ప్రజల నడ్డి విరిచే చర్య అని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయని, రైతులు వ్యవసాయ పనులు చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులు, లారీ డ్రైవర్లు, చిన్న వ్యాపారులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడ్డారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో మాత్రం ధరలను తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల కష్టార్జిత ధనాన్ని పన్నుల రూపంలో దోచుకుంటూ కార్పొరేట్ మిత్రులకు మేలు చేయడమే మోదీ ప్రభుత్వ అసలు లక్ష్యమని విమర్శించారు. ప్రజలపై మోపిన ఇంధన భారం వెంటనే తగ్గించాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించే వరకు సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు, ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






