శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బలహీనమైన సెక్షన్లు నమోదు చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పోక్సో చట్టంలోని సెక్షన్లు 7, 8 నమోదు చేయాల్సిన చోట కేవలం సెక్షన్లు 11, 12 మాత్రమే పెట్టారని, ఇది బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నమని విమర్శించారు. బండి భగీరథ్ చేసిన అఘాయిత్యానికి గురైన మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చందానగర్ డివిజన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్‌హెచ్-65పై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ పోక్సో కేసు ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్‌హెచ్-65 హైవేపై బైఠాయించి రోడ్డును దిగ్బంధించారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలి, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి, కాంగ్రెస్ – బీజేపీ రాజకీయ నాటకాలు ఆపాలి అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం మౌనం వహించడం దురదృష్టకరమని విమర్శించారు. మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, పొట్ట నరేందర్ యాదవ్, రోజా, మమత, నాగమణి, వాలా హరీష్, మిద్దెల మల్లారెడ్డి, తిరుమలేష్, కె. రాములు, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, సంతోష్ రెడ్డి, రామకృష్ణ గౌడ్, శివరాజ్, శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రకాష్, రాజు, వాకిటి శంకర్, నవీన్ యాదవ్, ప్రమోద్, ఘౌస్, బాబు మల్లేష్, సుభాష్ రాథోడ్, బీఆర్ఎస్వీ రాజు, షరీన్, రాజు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.





