శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ శాసన సభ్యురాలు, బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు తుల ఉమ డిమాండ్ చేశారు. బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వినతి పత్రం అందజేశారు. అలాగే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై విచారణ జరపాలని, బాధితురాలి కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని అరెస్ట్ చేయాలంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తుల ఉమ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే బాధ్యతగా రాజీనామా చేయాలని, భగీరథ్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి, మమత, రాగం జంగయ్య యాదవ్, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, నరేష్ సింగ్, అజయ్ గౌడ్, మాధవి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.






