పాదచారుల కోసం ఫుట్‌పాత్‌ల క్లియరెన్స్.. 30.29 కి.మీ. మేర ఆక్రమణల తొలగింపు..

శేరిలింగంప‌ల్లి, జూన్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్ నగరంలో పాదచారులకు సురక్షితమైన, ఆక్రమణల రహిత ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో టౌన్ ప్లానింగ్ విభాగం, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని నగరవ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ డ్రైవ్‌లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన ఆహార స్టాళ్లు, వీధి వ్యాపారులు, తాత్కాలిక నిర్మాణాలు తదితర అనధికార ఆక్రమణలను తొలగించి పాదచారుల రాకపోకలకు ఆటంకాలను తొలగించారు. శేరిలింగంపల్లి జోన్‌లో నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలోని ప్రధాన రహదారులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ జోన్‌లో 5 రహదారి విభాగాల్లో 10.8 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తం చేసి 197 ఆక్రమణలను తొలగించారు.

కూకట్‌పల్లి జోన్‌లో మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి సర్కిళ్లలోని మూడు రహదారి విభాగాల్లో 3.16 కిలోమీటర్ల మేర డ్రైవ్ నిర్వహించి 105 ఆక్రమణలను తొలగించారు. కుత్బుల్లాపూర్ జోన్‌లో చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలోని ఏడు రహదారి విభాగాల్లో 15.53 కిలోమీటర్ల మేర డ్రైవ్ నిర్వహించి 204 ఆక్రమణలను తొలగించారు. మూడు జోన్లలోని 15 రహదారి విభాగాల్లో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా 30.29 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తం చేయగా, మొత్తం 506 ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. పాదచారుల భద్రత, సౌకర్యవంతమైన రాకపోకలు, ప్రజా స్థలాలను ఆక్రమణల నుంచి విముక్తం చేయడమే లక్ష్యంగా నగరంలోని ఇతర గుర్తించిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రత్యేక డ్రైవ్‌ను దశలవారీగా కొనసాగించాలని కమిషనర్ సృజ‌న‌ అధికారులను ఆదేశించారు. ఫుట్‌పాత్‌లపై పునరావృతమయ్యే ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగించాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here