H-CITI ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలి: CMC కమిషనర్ సృజ‌న

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని గ‌చ్చిబౌలి ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ జంక్షన్లలో H-CITI ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం IIIT జంక్షన్, ఖాజాగూడ జంక్షన్లలో నిర్మాణంలో ఉన్న H-CITI ఫ్లైఓవర్ పనులను క్షేత్రస్థాయిలో ఆమె పర్యవేక్షించారు. నగరంలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని ఆమె సమీక్షించారు. తనిఖీ సందర్భంగా కమిషనర్ పనుల ప్రస్తుత స్థితిగతులను అంచనా వేస్తూ, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, వర్షాకాలం ప్రారంభానికి ముందే పునాది స్థాయి (Foundation level) పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రాజెక్ట్ అమలును నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా చూడాలన్నారు. IIIT జంక్షన్, ఖాజాగూడ జంక్షన్ ఫ్లై ఓవర్లను మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా విధించారు. ప్రతి పనిని అంశాల వారీగా (Item-wise) సమీక్షిస్తూ, లక్ష్యానికి అనుగుణంగా పురోగతి సాధించేలా ఫీల్డ్ ఇంజనీర్లు మైక్రో-లెవల్ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, కనెక్టివిటీని పెంచడానికి, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఫ్లైఓవర్లు ఎంతో కీలకమని కమిషనర్ పేర్కొన్నారు. పనులు సకాలంలో పూర్తి చేస్తూనే, నాణ్యతా ప్రమాణాలను క‌చ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here