ఆర్‌టీసీ కార్మికుల న్యాయ‌మైన డిమాండ్ల‌ను వెంట‌నే నెర‌వేర్చాలి: జేఏసీ నాయ‌కులు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్ర ఆర్‌టీసీ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ గురువారం ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వ‌హించారు. మియాపూర్ బ‌స్ డిపో నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్డు వ‌ర‌కు జేఏసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ ర్యాలీలో నాయ‌కులు కె.రాజ‌బాబు, బాషాగౌడ్‌, రాఘ‌వేంద‌ర్‌, ద‌ర్గ‌య్య‌, శ్రీ‌నివాస్ గౌడ్‌, భాస్క‌ర్‌, పాండు, బీఎస్ రాజు, వ‌సంత‌, రుక్మిణి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతియుత ప‌ద్ధ‌తిలో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేయ‌డం దారుణ‌మ‌ని ఆరోపించారు. న్యాయమైన డిమాండ్ల‌ను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం ఆర్టీసీ కార్మికులు ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బంద్‌ చేయడంతోనే దేశ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు లభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కార్మికుల డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌క‌పోతే ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here