వైభవంగా వైష్ణవి అన్నమ స్వరార్చన

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ జరిగింది. అనంతరం సాయంత్రం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది. అనంతరం వైష్ణవి సిద్ధవరపు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మధుర స్వరాలతో అన్నమయ్య స్వరార్చన సమర్పించారు.

ఈ సందర్భంగా మహా గణపతిం, గోవింద గోవింద, నిఘమా, ఇన్ని రాసులాయినికి, కట్టెదురా వైకుంఠము, సీయాపతి రామచంద్ర కీ, చూడరమ్మ సతులాల, బ్రహ్మమొక్కటే, వేదంబెవ్వని, చంద్రచూడ, క్షీరాబ్ధి కన్యకకు తదిత‌ర‌ అన్నమయ్య సంకీర్తనలను సుమధుర స్వర సమన్వయంతో ఆలపించి విచ్చేసిన భక్తులను విశేష వైభవంగా ఆకట్టుకున్నారు. ఈ స్వరార్చనకు కీబోర్డు పై చిప్పడ పవన్ కుమార్, రిధమ్ ప్యాడ్స్ పై చితారు విజయ కుమార్, వేణువుపై పి. నటరాజ్, తబలాపై జయచంద్ర వాయిద్య సహకారం అందించి గానానికి మరింత మాధుర్యం చేకూర్చారు. ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఒక అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, వైష్ణవి గానాన్ని అభినందించారు.

అనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ వైష్ణవికి, వాద్య కళాకారులకు స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో అన్నమయ్యపురంలో జరిగిన అన్నదానం – పారాయణం – స్వరార్చన కార్యక్రమం భక్తి, సంగీత మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here