వ‌రుస చైన్ స్నాచింగ్‌ల‌కు పాల్ప‌డుతున్న వ్య‌క్తి అరెస్టు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వ‌రుస చైన్ స్నాచింగ్‌ల‌కు పాల్ప‌డుతున్న ఓ వ్య‌క్తిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేష‌న్ లో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఈ మేర‌కు డీఐ ర‌మేష్ నాయుడు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మియాపూర్ ప‌రిధిలో నివాసం ఉండే గ‌ణ‌ప‌తిరాజు స‌త్య‌వాణి ఈ నెల 12న ఉద‌యం 6:30 గంట‌ల స‌మ‌యంలో మార్నింగ్ వాక్ కోసం హుడా పార్కుకు వెళ్లింది. తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో స్వ‌స్తిక్ హాస్పిట‌ల్ వ‌ద్ద ఓ ఇంటి ఎదుట పూజ కోసం పువ్వుల‌ను కోసేందుకు ఆమె ఆగింది. అదే స‌మ‌యంలో ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌చ్చిన ఓ వ్య‌క్తి వెనుక నుంచి ఆమెపై దాడి చేశాడు. ఆమె మెడ‌లో ఉన్న మంగ‌ళ‌సూత్రాన్ని లాక్కుని అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో స‌త్య‌వాణి మెడ‌పై స్వ‌ల్ప గాయాల‌య్యాయి. దీంతో ఆమె మియాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడికి చెందిన బైక్ నంబ‌ర్ ప్లేట్‌ను సాంకేతిక ఆధారాల‌తో గుర్తించిన పోలీసులు అత‌ని చిరునామా తీసుకుని నేరుగా అత‌ని ఇంటికి వెళ్లి అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో అత‌ని నుంచి పోలీసులు రెండు రోల్డ్ గోల్డ్ చెయిన్‌ల‌ను రిక‌వ‌రీ చేశారు. అనంత‌రం అత‌న్ని రిమాండ్‌కు త‌ర‌లించారు. కాగా నిందితుడు బోర‌బండ‌లోని అల్లాపూర్ ప‌ర్వ‌త్‌న‌గ‌ర్‌లో ఉంటున్న క్యాబ్ డ్రైవ‌ర్ కొత్త‌కోట గోవింద‌రావుగా పోలీసులు గుర్తించారు. అత‌ని స్వ‌గ్రామం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నం మండ‌లం తిద్దిమి కాగా అత‌ను న‌గ‌రానికి వ‌లస వచ్చి క్యాబ్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ్డ గోవింద‌రావు సుల‌భంగా డ‌బ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒంట‌రిగా క‌నిపించే మ‌హిళ‌లే ల‌క్ష్యంగా అత‌ను గొలుసు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డ‌డం ప్రారంభించాడు. దొంగిలించిన బంగారాన్ని అమ్మి దాంతో వ‌చ్చిన డ‌బ్బుతో అత‌ను జ‌ల్సాలు చేసేవాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను మియాపూర్‌, అమీన్‌పూర్ పోలీస్ స్టేష‌న్ల ప‌రిధుల్లో ప‌లు చైన్ స్నాచింగ్‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌హిళ‌లు ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, బంగారు ఆభ‌ర‌ణాలు క‌నిపించ‌కుండా చీర లేదా దుప‌ట్టాతో క‌ప్పుకోవాల‌ని, అనుమానాస్ప‌దంగా ఎవ‌రైనా క‌నిపిస్తే వెంట‌నే 100 నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేసి స‌మాచారం అందించాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here