శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని, ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా చూసేందుకు సహకరించాలని మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ కోరారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడ జాతీయ రహదారి యు-టర్న్ సమీపంలో క్రాస్ బారియర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మియాపూర్ నుంచి చందానగర్ వైపు వచ్చే రహదారిపై వాటిని ఏర్పాటు చేశామని, వాహనదారులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకుండా, అక్రమ పార్కింగ్‌కు పాల్పడకుండా, ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఉండేందుకే వాటిని ఏర్పాటు చేశామని సీఐ ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులపై రాంగ్ సైడ్ లో డ్రైవింగ్ చేయవద్దని, అలా డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల పలు చోట్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని, అందువల్లనే ఇలాంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు. పాదచారులు రహదారులను దాటేందుకు అందుబాటులో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలని, ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. అవసరం ఉన్న చోట సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని, రహదారులపై జీబ్రా క్రాసింగ్ గుర్తులను వేయిస్తున్నామని తెలిపారు. పాదచారుల సౌకర్యం కోసం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. హఫీజ్‌పేట జెన్‌ప్యాక్ట్ వద్ద రోడ్డు దాటేందుకు నూతనంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాయడం జరిగిందని, ఈ విషయమై వారు స్థలాన్ని పరిశీలన కూడా చేశారని తెలిపారు. ప్రస్తుతం 65వ నంబరు జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు, ఫుట్ పాత్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాహనదారులు, పాదచారుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.






