రోడ్డు భ‌ద్ర‌త‌, ట్రాఫిక్ నియ‌మాల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో క‌ల్వ‌రి టెంపుల్ రోడ్డులో ఉన్న శ్రీ చైత‌న్య కాలేజీలో గురువారం సాయంత్రం అరైవ్ అలైవ్ కార్య‌క్ర‌మంలో భాగంగా రోడ్డు భ‌ద్ర‌త‌పై విద్యార్థులు, స్థానికుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో సుమారుగా 600 మంది విద్యార్థులు పాల్గొన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు ప‌లు అంశాల‌పై విద్యార్థులు, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ర‌హ‌దారిపై ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో ద్విచ‌క్ర వాహ‌న‌దారులు హెల్మెట్ ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని, కారులో ప్ర‌యాణం చేసే వారు సీట్ బెల్ట్‌ను క‌చ్చితంగా పెట్టుకోవాల‌ని సూచించారు. అతి వేగం, నిర్ల‌క్ష్యంగా వాహ‌నాల‌ను న‌డ‌ప‌డం వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌న్నారు. మ‌ద్యం లేదా ఇత‌ర మ‌త్తు ప‌దార్థాల ప్ర‌భావంతో వాహ‌నాల‌ను న‌డ‌ప‌కూడ‌ద‌ని హెచ్చ‌రించారు. డ్రైవింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఫోన్ల‌లో మాట్లాడ‌కూడ‌ద‌ని, ట్రాఫిక్ నియ‌మాల‌ను పాటించాల‌ని, సిగ్న‌ల్స్ వ‌ద్ద, లేన్ విష‌యంలో క్ర‌మ శిక్ష‌ణ పాటించాల‌ని, జీబ్రా క్రాసింగ్‌ల వ‌ద్ద పాద‌చారుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని వాహ‌నాల‌ను న‌డ‌పాల‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో ప‌లు కేసుల్లో జరిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌కు చెందిన వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించి ట్రాఫిక్ నియ‌మాల‌ను, రోడ్డు భ‌ద్ర‌త‌ను పాటించ‌కుండా వాహ‌నాల‌ను న‌డిపితే ఎలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతాయో విద్యార్థుల‌కు వివ‌రించారు. ట్రాఫిక్ నియ‌మాల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌డం, నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేయ‌డం, అతి వేగంతో వాహ‌నాన్ని న‌డ‌ప‌డం వంటి చ‌ర్య‌ల వ‌ల్ల తీవ్ర‌మైన ప్ర‌మాదాలు చోటు చేసుకుంటాయ‌ని, తీవ్ర గాయాల బారిన ప‌డ‌తార‌ని, చాలా వ‌ర‌కు సంద‌ర్భాల్లో ప్రాణాలు పోయే అవ‌కాశాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. అందువ‌ల్ల వాహ‌న‌దారులు ర‌హ‌దారి భ‌ద్ర‌త‌ను, ట్రాఫిక్ నియ‌మాల‌ను దృష్టిలో ఉంచుకుని వాహ‌నాల‌ను న‌డ‌పాల‌ని పోలీసులు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో కూక‌ట్‌ప‌ల్లి జోన్ డీసీపీ రితిరాజ్‌, కేపీహెచ్‌బీ ఏసీపీ ర‌వికిర‌ణ్ రెడ్డి, మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీ ఆదిమూర్తి, మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్‌, ఇత‌ర సిబ్బంది, కాలేజీ అధ్యాప‌కులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here