శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలకు గురై సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికుడు ఎం.రాజశేఖర్ ని తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే యేసు రత్నం, రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ఎం.రాజశేఖర్ (32) పాపి రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడని, అతనికి భార్య, మూడు సంవత్సరాల వయస్సు కలిగిన ఒక కూతురు ఉన్నారని తెలిపారు. శేరిలింగంపల్లి పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా గత 11 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాడని, ఈ నెల 12న ఉదయం 5 గంటలకు విధులకు హాజరయ్యాడని, పాపి రెడ్డి కాలనీ కమాన్ కు ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని ఎస్ఆర్పీ బాల్ రాజు, శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ వినయ్ చెప్పడంతో రాజశేఖర్ ఆ పనిచేసేందుకు సిద్ధమయ్యాడని తెలిపారు.

ఈ క్రమంలో ఫ్లెక్సిలను తొలగిస్తుండగా కమాన్‌కు రెండు వైపులా ఉన్న విద్యుత్ వైర్లు తగిలి రాజశేఖర్ విద్యుదాఘాతానికి గురయ్యాడని, దీంతో అతను 20 ఫీట్ల ఎత్తు నుంచి కింద పడ్డాడని, దీని వల్ల అతనికి విద్యుదాఘాతంతో గాయాలు అవడమే కాకుండా, కింద పడినందు వల్ల కూడా తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. అతని కుడికాలు విరిగిందని, ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. వాస్తవానికి ప్రతి సర్కిల్లోనూ ఫ్లెక్సీలను తొలగించే బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ వాహనంపై పనిచేసే వారికి ఉంటుందని, అలాంటిది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఎలాంటి భద్రత లేకుండా పారిశుద్ధ్య కార్మికుడితో ఆ పని చేయించారని, వారి నిర్లక్ష్యం కారణంగానే ఆ కార్మికుడు ప్రస్తుతం తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరించారని, అది సరికాదని, ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఫ్లెక్సీలను తొలగించమని చెప్పిన ఎస్సార్పీ బాలరాజు ను సస్పెండ్ చేయాలని, ప్రమాదానికి గురైన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే కార్మికులతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.






